తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, ఒకప్పటి గ్లామరస్ హీరోయిన్ దివంగత జయలలిత మొట్టమొదట అభిమానించేది ఏమిటంటే.. క్రికెట్! అవును. ఆ ఆట అన్నా, అది ఆడేవాళ్లన్నా ఆమెకు చిన్నప్పట్నుంచీ ఎంతో ఇష్టం. ఆమె క్రికెట్ పిచ్చి చూసి, ఆమె తమ్ముడు అనేవాడు, "ఆ.. మీ ఆడవాళ్లు ఈ ఆటలో ఇంట్రెస్ట్ చూపడమేంటి? ఇది మగవాళ్లు ఆడే ఆట" అని. కొన్నాళ్ల తర్వాత క్రికెట్‌కు సంబంధించిన ఒక పుస్తకం చదువుతూ ఉంటే అప్పుడు జయలలితకు తెలిసింది, తన తమ్ముడు పప్పులో కాలు వేశాడని! ఎంచేతంటే అసలు క్రికెట్ ఆటను కనిపెట్టిందే ఆడవాళ్లని ఆ పుస్తకంలో వివరంగా రాశారు.
సినిమాలు చూసి యాక్టర్లను అభిమానిస్తున్నట్లుగా, ఆ రోజుల్లో క్రికెటర్లంటే జయలలితకూ, ఆమె స్నేహితురాళ్లకూ చాలా పిచ్చి ఉండేది. వాళ్ల పిన్ని విద్యకు కూడా క్రికెట్ అంటే ఎంతో ఇష్టం. మద్రాసులో జరిగే టెస్ట్ మ్యాచ్‌లకు వాళ్లు తప్పనిసరిగా వెళ్లేవారు. ఒకవేళ వీలుకాకపోతే మ్యాచ్‌కు సంబంధించిన రన్నింగ్ కామెంటరీని వదిలిపెట్టేవాళ్లు కాదు.
మ్యాచ్ అయిపోయాక అవకాశం దొరికినప్పుడల్లా తను అభిమానించే ఆటగాళ్ల వద్దకు వెళ్లి వాళ్ల ఆటోగ్రాఫ్ తీసుకునేవారు జయలలిత. అప్పట్లో వాళ్లింటికి 'స్పోర్ట్ అండ్ పాస్ట్ టైమ్' అనే మ్యాగజైన్ వస్తుండేది. అది వచ్చిన రెండో గంటలో అందులోని పేజీలు కత్తిరింపులతో కనిపించేవి. ఒకవైపు ఎవరిలా చేసింది అని ఇంట్లో తర్జనభర్జనలు జరుగుతూ ఉంటే, మరోవైపు అప్పటికే కత్తిరించి తన ఆల్బమ్‌లో అంటించి పెట్టుకున్న ఆ క్రికెటర్ల బొమ్మలను చూసుకుంటూ ఉండేవారామె. అసలు సంగతి తెలిశాక ఇంట్లోవాళ్లు చివాట్లు పెట్టేవారు. జయలలిత లెక్కచేసేవారు కాదు.
ఆమె స్కూల్లో చదువుకునేటప్పుడు వాళ్ల క్రికెట్ పిచ్చి కనిపెట్టిన ఒక ఫొటోగ్రాఫర్ అప్పుడప్పుడు క్రికెట్ ప్లేయర్స్ ఫొటోలు పట్టుకొని జయలలిత బ్యాచ్ దగ్గరకు వచ్చేవాడు. ఎవరికి ఏ ఆటగాడు ఇష్టమైతే వాళ్లు ఆ ఫొటో అతని దగ్గర్నుంచి కొనుక్కునేవారు. ఒక్కో ఫొటోకు ఆ ఫొటోగ్రాఫర్ ఐదు రూపాయలు వసూలు చేసేవాడు. అన్నట్లు.. జయలలిత ఎవరి ఫొటో తీసుకొనేవారో తెలుసా? అప్పటి ఇండియన్ క్రికెట్ టీమ్ కెప్టెన్ మన్సూర్ అలీఖాన్ పటౌడీ ఫొటో!
ఆ రోజుల్లో హిందీ హీరో రాజేశ్ ఖన్నాను చూసి ఎంతమంది అమ్మాయిలు మోజుపడేవారో, జయలలిత బృందం టైగర్ పటౌడీని అంతగా అభిమానించేవారు. స్కూల్స్‌లో 'పటౌడీ ఫ్యాన్ క్లబ్' అని ఉండేవి కూడా. ఇక ఆయనను ప్రేమించడంలో ఉన్న పోటీ అంతా ఇంతా కాదు. ఒకరోజున పటౌడీ.. ప్రముఖ నటి షర్మిలా ఠాగూర్ పరస్పరం ప్రేమలో ఉన్నారనే వార్త బయటకు వచ్చింది. అంతే! ఎవరి ప్రేమ వాళ్ల దగ్గరే భద్రంగా ఉండిపోయింది. ఈ విషయాలను తను హీరోయిన్‌గా ఒక వెలుగుతూ ఉన్న కాలంలో ఒక పత్రికకు రాసిన వ్యాసంలో రాసుకొచ్చారు జయలలిత.
(డిసెంబర్ 5 జయలలిత జయంతి సందర్భంగా)